సమస్య మనది -- సలహా గీతది --

 సమస్య మనది -- సలహా గీతది -- 

https://ajaraamarasukthi.blogspot.com/2025/07/1.html

భగవద్గీతబైబిలు ఖురాన్ ల వంటిది కాదు. అది జీవితపు చీకటిలో కరదీపిక. ఇహపరాల విజ్ఞాన వేదిక. భగవద్గీత ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఇక్కడ customer అన్నవాడు ముముక్షువు. ఎన్నో ఊహలు ఎన్నెన్నో  సందేహాలు. అన్నింటికీ సమాధానాలు కావాలి. మరి ఒక్కొక్క సమాధానానికి ఒక్కొక్క చోటికి పోలేడు. మరి అన్నీ ఒకే చోట దొరికే అవకాశముంటే ఆ ఒక్క చోటే చాలు. మరి అంతకంటే ఆ కష్టమరుకు అంటే ఆ ముముక్షువుకు వేరేమి కావలసి వుంటుంది. పరమునందుకొను మార్గములు పలు తెరగులని చెబుతున్న గీత ఇహ సాధనమునకు గూడా ఎన్నో మార్గములను సూచిస్తూవుంది. అందుకే దీనిని లక్ష్య గ్రంధమనికూడా అనవచ్చును. ఇందులోని శ్లోకసారమును మనము ఎంతో సులభముగా మన జీవితకార్యాలయఔద్యోగిక మరియు ఆంతరంగిక విషయములకు మాత్రమే గాక సునిశిత 

పరిశీలనము ద్వారా ప్రతి జీవిత సమస్యకును తగిన సమాధానమును సమకూర్చుకొనవచ్చును. భగవద్గీతలోని జ్ఞానము అపార పారావారము. దేవుడు ఒకడే అయినా ఏ పేరును స్మరిస్తూ తరింపదలుస్తామో ఆ రూపముననే ప్రత్యక్షమయినట్లు భగద్గీత ఒకటే అయినా మనము తలపోయు సమస్యకు తాను సమాధాన రూపములో మనకు దర్శనమిస్తుంది. ఇక మనము ఈ క్రింది సమస్యతో మన సందేహములను ప్రారంభించుదాము.


సమస్య: 

నేనేమో సర్వ సన్నద్ధమైనాను. చివరి నిముసములో అది నిరుత్సాహామోభయమోనిర్లక్ష్యమోనన్నావరించింది. పని జరుగుతుందన్న నమ్మకము సన్నగిల్లింది. నాకు ఏమీ తోచుట లేదు.

సలహా :

నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. ఆత్మస్థైర్యము అన్నది ఆచరణకు ఆభూషణము. పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టు. 

నీ కార్య సాఫల్యమునకు అదే ఉడుము పట్టు. ఇక్కడ ఉడుము ను గూర్చి రెండు మాటలు చెబుతాను. పూర్వము పెద్ద పెద్ద బురుజులుగల కోట పైకి శత్రు సైనికులు .చేరాలంటే బలమైన మోకుకు (అంటే పురి గల చేంతాడు లాటిది.) ఈ ఉడుములు చాలా తెలివి గలవి. వీటికి పొడ వైన మెడశక్తివంతమైన తోకఅవయవాలు ఉండి కాళ్ళు నాలుగూ చాలా బలిష్టంగా ఉంటాయి. 'ఉడుము అనగానే చరిత్ర తెలిసిన చాలామందికి శివాజీ గుర్తుకు వస్తాడు. ఛత్రపతి శివాజీ ఈ ఉడుముల్ని ప్రత్యేకంగా పెంచేవాడు. వీటి నడుముకు పెద్ద వెూకులు తాళ్ళు కట్టిమూతికి బెల్లం పాకం రాసి శత్రువుల కోటగోడల వద్ద పైకెక్కింపజేసే వాడు. అవి పూర్తిగా పైదాకా ఎక్కిన తరువాత ఆ తాడు కొద్దిగా లాగితే ఆ ఉడుము గోడ చివరి భాగాన్ని గట్టిగా పట్టుకునేది.  ఎంత గట్టిగా పట్టుకునేది అంటే ఆ మోకు ఆధారంగా సైనికులంతా కోట గోడలెక్కి కోటలోనికి చేరుకోనేవారు. ఇంతమంది ఆ ఉదుమునకు కట్టిన మోకు సహాయముతో ఎక్కినా ఉడుము మాత్రము చలించేదికాదు. అందుకే 'ఉడుము పట్టుఅన్న సామెత జనబాహుళ్యములో ప్రబలమై ఉన్నది .  'భయముంటే జయముండదు'. అందుకే 'పట్టు విడకు నేరే సాధన ఫలియించును శుభకామనఅన్న మాటను కలకాలమూ గుర్తుంచుకొనవలసియుంటుంది. 'ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులైఅన్నది భర్తృహరి సుభాషితము. 'అలసత్వమును గూర్చి ఒక్క మాట చెబుతాను. 'అలసత్వముఅన్నది ఒకటే పదమైనా అందులో మనము 'అలసత్వముఅన్న రెండు పదాలుగా మన అవసరము కొరకు విడగొట్టుకొనవచ్చును. 'అలమనస్తిమితమును దూరము చేసి ఆలోచనకు తావివ్వక అనర్తమును సృష్టిస్తుంది. అదే 'సత్వముఅన్నది ఉత్తమోత్తమ గుణము. 'సత్వముగలిగినవాడే మనస్సును నిగ్రహించి తనదారికి మరలించాగాలుగుతాడు. గలవాడు సాధించలేనిది లేదు. కొంగ తానూ నిర్ణయించుకొన్న మార్గమునకు కట్టుబడి సరసులో కొంగజపము చేస్తూ నిలబడి చిన్న చేపలను తాకకుండాఏ పరిస్థితిలోనూ నిరుత్సాహపడకుండాఉండుటచే పెద్ద చేపలకు భ్రమ కలిగించి తన పబ్బము గడుపుకొనుచున్నది. మనకు కావలసినది కూడా ఆ పట్టుదలే!

ఇక భయమును గూర్చి. బాల్యములో వీధి కుక్కలు వెంటబడితే కరుస్తాయేమోనన్న భయం తో పరుగెత్తే వాళ్లము. అప్పుడు ఇల్లు చేరిన పిదప మా అమ్మమ్మ చెప్పేది " నీవు పరిగెత్తటం వల్ల అవి నిన్ను వెంబడిస్తున్నాయి నీవు స్థిమితపడి నెమ్మదిగా నడువు ,అవి నీ జోలికి రావు. ఆమాటే నా జీవితపు రాచబాట అయ్యింది. ఈ వాస్తతవముపరీక్ష కొరకై నిరీక్షించే విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. ఒలుపు వైనముగా నిలుపు నిదానముతో ఏపనిచేసినా అలుపు ఆయాసము లేకుండా ఉంటుంది. రోడ్డునకు మధ్యలో నిలబడి దూరము నుండి వచ్చె పెద్ద ట్రక్కును చూస్తె మొదట చిన్నదిగానే కదా కనబడుతుంది. పట్టించుకోకుండానో పరధ్యానముగానో ఉండి దగ్గరకు వచ్చినపుడు చూస్తే ఊహకు అందకుండానే చూచినవాడులోకానికి దూరమై పోవచ్చు. కాబట్టి దీర్ఘదర్శనము కలిగినచో ఆపదలను అధిగమించి ఆనంద ఫలితములందుకొనవచ్చును.


ఇంతటి గొప్ప విషయాన్ని రెండు పంక్తులలో భగవద్గీత ఎంత హత్తుకోనేవిధంగా చెప్పిందో చూడండి .

సమరమునకు సర్వ విధములా సమాయత్తమైన తరువాత పాప భీతి యను భ్రాంతి లో మునిగిన  బీబత్సునితో 

కృష్ణు డిట్లంటున్నాడు.

క్లైబ్యం మాసమ గమః పార్థ నైతత్వయ్యు పద్యతే

క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్విష్ఠ పరంతపా 


తగని సమయమున తలపులు మారెను

నపుంస తత్వము నరముల నిండెను 

దుర్బలత్వమును దూరముచేయుము

పరంతపా అదె పరమోత్కృ ష్టము 

                              (స్వేచ్ఛానువాదము)

ఇక్కడ పార్థ అని పరంతప అని రెండు సంబోధనలు కృష్ణుడు అర్జనునకు  వాడుచున్నాడు. మొదటిదానికేమోపృథ కుమారుడు  (అంటే కుంతీదేవి మరోపేరు పృథ ) అన్నది ఒక అర్థమైతే వేరొక అన్వర్థములో  పార్థివ మైన శరీరముఅంటే మట్టిలో కలిసిపోయేదికలిగిన అర్జునా ! అని. అంటే మానవులమైన మనమందరమూ ఎదో ఒకరోజు మన్నులో కలిసి మిన్ను జేరవలసిందే అని అన్వయాత్మకముగా చెబుతున్నాడు. అంటే లేనిపోని వ్యథలు వ్యామోహాలు పెట్టుకోకు. చేయవలసిన పనిని సాకులుచేప్పి తప్పించుకోజూడకుఅని హెచ్చరించుచున్నాడు. ఇక పరంతపా అన్నది రెండవ సంబోధన. యుద్ధభూమిలో వున్నారు కాబట్టిఅర్జనుడు వీరాధి వీరుడు కాబట్టిశత్రువులను తపపింపజేసే వాడా అంటున్నాడు. అంటే అతని సామర్థ్యము అతనికి గుర్తు చేస్తున్నాడు. అసలు 'పరంతపఅన్న మాటకు శత్రు భయంకరుడు అన్న అర్థమును తీసుకొనవచ్చును. అరిశాద్వార్గాములే మన నిరంతర అన్తఃశత్రువులు. వానిని మట్టుబెట్టగలిగినా లేక కనీసము అణచివేయ గలిగినా మనము లక్ష్యసాధనకు అడుగు ముందునకు వేసినట్లే! ఈ విధముగా సరియగు సమయములో సరియయిన సలహాను ఇచ్చుటనే కదా పాశ్చాత్యులు counselling అనేది. మన దేశములో ఎన్ని వేల సంవత్సరములనుండి ఉన్నదో గమనించండి. అందుకే తన పంచ రత్న కీర్తనలలో త్యాగయ్య 'సమయానికి తగు మాటలాడిఅన్నాడు. విద్యార్థుల విషయములో ధైర్యము నింపటము తల్లిదండ్రుల బాధ్యత. ఏదయినా interview కు వెళ్ళే సమయములో ఈ శ్లోకము గుర్తుంచుకొంటే ఎంత ధైర్యమిస్తుందో ఎంత ధైర్యమొస్తుందో చూడండి. ఏ పని ప్రారంభాములోనైనా పైన తెలిపినఈ శ్లోకము ఒక శిలా శాసనము.

మరియొక సమస్యకు జవాబుతో మళ్ళీ కలుస్తాము.

మన విద్యారంగములో పూర్వ వైభవము ఎప్పటికీ వస్తుందో?

సమస్య మనది - సలహా గీతది --3

సమస్య :జరిగే ప్రతి సంఘటనకు, అది మంచి గానీ చెడు గానీ, నాలో ఒక ప్రతిక్రియ కల్గుతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తులపై, వారు అయినవారు అయినా కాకున్నా పరితాపము పెరుగుతుంది. చచ్చిన వారు చచ్చినారే అని బాధపడగా బ్రతికినవారు బాగుపడలేక పోతున్నారు అని బాధ. ఇది ఏవిధంగా తీరగలుగుతుంది?


సలహా : ఇది నీ భ్రమ. ఈ భ్రమయే ఒక నిర్లిప్తతకు, ఆ నిర్లిప్తత ఒక విధమగు వైరాగ్యానికి దారి తీస్తాయి. ఈ వైరాగ్యమును కూడా మన పెద్దలు మూడు విధములుగా విభజించినారు. 1. పురాణ వైరాగ్యము 2. ప్రసూతి వైరాగ్యము ౩. స్మశాన వైరాగ్యము.

1.     పురాణ వైరాగ్యము: నీవు విశ్వామిత్రుని జీవితమును గూర్చి, ఆయన బ్రహ్మర్షి అయిన విధమును గూర్చి ఒక పౌరాణికుడు ఎంతో హృద్యముగా చెబుతూవుంటే తస్దేకముగా విన్నావు. వెంటనే నీవుకూడా తపోదీక్ష వహించి అంతటివాడు కావాలనుకోన్నావు. పురాణం ముగిసింది. బయట పాడినావు. మార్గ మధ్యములో ఉందీ వుందని బట్టలతో నాట్య విన్యాసము చేయుచున్న ఒక నటి Wallposter చూసినావు. ఇప్పుడు నీ మెదడులో విశ్వామిత్రుడు లేదు, పురాణమూ లేదు. ఇప్పుడు కేవలము నీవు ఆ నటి నాట్యము చేస్తున్న ఊహ తప్ప. అంటే ఈ పురాణ వైరాగ్యము క్షణికము అని తెలిపోయినది కదా! సదా ఆభావన మనసులోవుంటే నీ కర్తవ్యము నుండి నీవు విముఖుడవు కావు.

2.    ప్రసూతి వైరాగ్యము: ఇల్లాలు ప్రసవించే సమయములో ఇక వద్దురా పిల్లలు అనుకొంటుంది. కానీ కొంతకాలము తరువాత అబ్బాయి\అమ్మాయి పుడితే బాగుణ్ణు అనుకొంటుంది. అంటే ఒక వస్తువును పొందుటకు కలిగినబాధ ఆ క్షణమునకు చాలా ఎక్కువ అని అనిపించినా కొంత కాలము తరువాత అందలి ఆనందము హృదయమును ఆవహించుటతో తిరిగీ అదేకావలెనని అనిపిస్తుంది. దీనినే తాత్వికులు మాయ అంటారు. ఇంగ్లీషు మందులు తీసుకొంటే వ్యాధి అణిగినట్లు ఇక్కడ కోరిక అనిగియుండినది కానీ అది తుడిచిపెట్టబడలేదు.

3.    స్మశాన వైరాగ్యము: ఒక Chain Snatcher యొక్క భార్య చనిపోయింది. ఆమెకు ఉత్తరక్రియలు జరుపుతూ ఇక నేను ఆడవారి బంగారు గొలుసులు లాగి ఎవరికివ్వాలి. అసలు ఇక నా బ్రతుకునకు అర్థమొకటి ఏడ్చిందా! అని ఎంతో విలపించినాడు. ఆ బాధను భరించలేక సారా కొట్టుకు పోయి సారా త్రాగినాడు. సారా పోస్తూ ఒక మదవతి కనిపించింది. ఎట్లయితేనేమి ఇరువురి మధ్య ఆకర్షణ ఏర్పడి సహజీవనము సాగించ మొదలుపెట్టినారు. మొదటి భార్య పిల్లలు వీధిపాలయినారు. కొత్త భార్య కోసం మళ్ళీ తన పాత వృత్తి మొదలు పెట్టినాడు. దీనివల్ల ఏమి తెలుస్తూవుంది. పెరుగుతున్న తులసి మొక్క వరదలో కొట్టుకపోయినట్లయినది.

కావున మనలో ఏర్పడిన సంకల్పము  మంచిదై దానికి బలము చేకూరితేనే అది కార్యరూపము దాలుస్తుంది. మాయా మోహములు ఆవరించు ఉన్నంతవరకు మనిషికి  తన బాధ్యత తెలిసిరాదు.

ప్రతిజీవికీ, జీవితములో తనకొక విధి,బాధ్యత , కర్తవ్యము ఉంటుంది. నీ మనసును ఆ బాధ్యత పైన లగ్నం చేస్తే అన్యధా కలిగే ఆలోచనలు వాటికవే పటాపంచలైపోతాయి. ఎందుకంటే నీ మనసు నీ పని పై లగ్నమైవుంది కాబట్టి. ఇక పనిలేనపుడు నీవు ఆలోచించే వ్యక్తులను గూర్చి అంటావా వారంతా వారివారి 1.ప్రారబ్ధ 2.సంచిత కర్మఫలములననుభవించుతూ మూడవదియైన, తదుపర్ జన్మలో వచ్చే ఆగామి కర్మననుభవించుటకు,   కర్మల జేసి వాని ఫలితములనుభవింప ఎదురుచూచుచున్నారు. ఇందులో నీ ప్రమేయము అసలేదీ. మరి ప్రమేయమే లేకపోతే చింతపడి ప్రయోజనమేమి పొందుతావు.

భగవాన్ రమణుల, తెలుగులోకి అనువదించిన "ఉపదేశ సారం" ఎందరో ముముక్షువులకు మార్గదర్శకము. ఈ చిన్న సంస్కృత శ్లోక పాదము ఎంత అర్థవంతముగా వుందో చూడండి.

ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం | చిత్త శోధకం, ముక్తి సాధకం ||”

అంటే పైన చెప్పిన ప్రకారం కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాసక్తి లేకుండాను, లోకహితార్థముగాను, ఈశ్వరార్పితముగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.

 

అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, అవి మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి. ఈ మాటను సులభముగా అర్థము చెసుకొనవలెనంటే మనము ఒక పని చేయ తలపెట్ట దలచినపుడే మంచి చెడులను క్షుణ్ణముగా పరిశీలించి, ఈ కర్మ ఫలితము మన ప్రస్థానమును  పరమాత్ముని సమీపమునకు చేర్చుతుందా అన్న అవగాహనతో చేయుట అత్యుత్తమమగు విషయము. కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకొని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకొని కర్మలు చేయాలి. అప్పుడే ఆ కర్మ త్రికరణ శుద్ధి కలిగియుంటుంది. సత్వ గుణమును ఎంతగా మనము అభివృద్ధి పరచుకొంటామో మన బుద్ధి కూడా ఎక్కువగా సత్వగుణ సముపేత కార్యాచారణము మీద మక్కువ ఎక్కువగా చూపుతుంది. మనము వర్తమానములో ఎపనినైతే ప్రారంభిస్తున్నామో దాని కొనసాగింపు ఆగామి కర్మ అవుతుంది.ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుండి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను అంతఃకరణ శుద్ధితో చేసి అది మన భూతకాలకర్మానుబంధము అగులాగున జాగ్రత్త పడవలెను అంతేగానీ అది సర్పబంధము కాకూడదు. కావున ఎప్పుడయితే విచక్షణాయుతమైన కార్యాచరణకు నీవు గడంగుచున్నావో అప్పుడు నీవు 'జ్ఞాని' అన్న పట్టమునకు చేరువవుతున్నట్లే. అప్పుడు ధర్మా ధర్మ విచక్షణతో కర్మాకర్మ లను గమనించి ఆచరణ గావించ గలవు.

ఈ విషయాన్నే కృష్ణుడు అర్జనునితో ఈ విధంగా చేబుతాడు : 

అశోచా నన్వశోచన్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే 

గతాసూనగతాసూంశ్చనాను శోచంతి పండితాః  11-2

 

అగతుల విగతుల నందరి గూరిచి

తలపోయకు నీ తలలో చేరిచి

ప్రజ్ఞా వాదపు భ్రమలో మునుగడు

జ్ఞాని వానిపై జ్ఞాపకముంచడు     (స్వేచ్ఛా నువాదము )      11-2

 

ప్రజ్ఞావాదము ను గూర్చి ఒక మాట చెప్పుకొందాము. ఇది చాలా పెద్ద విషయము. నా దృష్టి లో ప్రజ్ఞా వాదమంటే ' దూరంగా ఒక ఇంటిలోనుండి పొగ వస్తూవుంది. తనకు గల  ప్రజ్ఞను వాడి వెంటనే నిప్పులేనిదే పొగ రాదు అని చెబుతాడు. కాబట్టి ఇంటికి నిప్పంటుకొనింది అంటాడు.' నిజానికి ఇది నిజమైతీరనవసరము లేదు. ఇల్లన్న తరువాత ఏ వంటకో వార్పుకో , లేక ఏ సాంబ్రాణి వెలిగించుట వల్లనో కూడా పొగ రావచ్చు. దూరమున్నందువల్ల వాసన రాకపోవచ్చు మరి అంతమాత్రాన ఇల్లుకాలుతూ వుంది అన్న నిర్ధారణకు రాలేము కదా!  ఇదీ  ప్రజ్ఞా వాదము నా అభిప్రాయములో ! కాబట్టి అది తర్కమునకు నిలువదు.

పండ అంటే ఆత్మ విషయమైన జ్ఞానము. ‘పండా ఆత్మా విషయా బుద్ధిః  సాయేషాంతే పండితాః’ అంటే ఆ ఆత్మజ్ఞానము  కలిగినవాడు పండితుడు.  అతడు తన జీవితాన్ని తామరాకు నీటిబొట్టు లాగా గడుపుతాడు .అంటియున్నట్లే ఉంటాడు కానీ అంటించుకోడు. జ్ఞానమునకు వేదశాస్త్రాలన్నీ కంఠ పాఠమై యుండ నవసరములేదు. విచక్షణ వుంటే చాలు. జీవితము నశ్వరము. నేడు అతడైతే రేపు నీవు. ఇది చక్రము. అందరూ దీనినంతుకొని తిరుగావలసిందే!  కాబట్టి చింత వీడి నీ కర్మల నీవాచారించు. అవి దుష్కర్మలు కాకుండా చూసుకో! 

అసలు ఈ శ్లోకమును నీ లౌకిక కార్యాలయమునకు సంధించుకొంటే ఒకడు transfer అవుతాడు, ఒకడు suspend అవుతాడు, ఒకడు పనీ పాట చేయడు. నీవు వీరిలో ఒక్కొక్కరిని గమనించినపుడు ఒక్కొక విధమగు అనుభూతి. కానీ ఈ విషయములకు ప్రాధాన్యతనివ్వక నీ బాధ్యత నీవు సక్రమముగా నిర్వర్తించుకొంటూ పోతే నీకు రావలసిన promotions రాకుండా పోవు. నీకు రాక పోతే అది నీది కాదనుకో. మనసును అల్లకల్లోలము కానీకుండా ఆరోగ్యముగా వుంచుకొనగలుగుతావు. అది వుంటే నీ వార్ధక్యమును చక్కగా గడుపుకొన గలుగుతావు.  నీ ఆత్మ పరమాత్మను కలిసేవరకూ నీతో వుండేది నీ శరీరము. దానికి తనపనులు తానూ చేసుకోగలిగే వసతి దానికి కల్పించు. అది నీ ఆధ్యాత్మిక దఎయమునకు చక్కని బాటను వేయగలుగుతుంది. ప్రభుత్వ మరియు బెంకింగ్ కార్యాలయములలో ముఖ్యముగా retire అయ్యేకాలానికి  BP, DIABETES లేకుండా ఉన్నవారిని వ్రేళ్ళ పైన లెక్కింపవచ్చును అన్నది నా అభిప్రాయము. తస్మాత్ జాగృత.

స్వస్తి.

4 మరొకమారు......

సమస్య మనది -- సలహా గీతది -- 4

సమస్య : అతను నాకు అత్యంత ఆప్తుడు. అతను గతించుతాడని నేను తలవనేలేదు. నేనతనిని మరువనే లేను. 

సలహా : నీకు జవాబు చెప్పబోయే ముందు 'రైలు ప్రయాణమును గూర్చి నేను వ్రాసిన ఈ గేయమును గమనించు:

రైలు ప్రయాణము -జీవన యానము

వచ్చునెప్పుడని యన్నది తెలుసు

పోవు నెప్పుడని యన్నది తెలుసు

వచ్చి పోవు ఆ బండి కొరకు నీ

తపన దెందుకో ఎవరికి తెలుసు

     రాకపోకలకు నడుమన మనము

     రాద్ధాంతములను చేయుచుందుము

     జీవితమే ఒక రైలు ప్రయాణము

     మేటి విల్తుడది వదలిన బాణము

రెండిటి నడుమన యున్నభేదము

ఏమిటన్నయది ఇపుడే చూతము

రైలుయానమున గాంచెదమంతము

జీవయానమది చూడుమనంతము

      ఖర్చులు మనవి కష్టము మనది

      సంపాదించే సౌఖ్యము మనది

      పంచిన ధనము,పెంచును ఘనము

      రైలు యాత్రలో ధన మింధనము

 ప్రయాణ వేదిక ప్రవేశ మందిన (ప్రయాణ వేదిక = railway platform)

మరునిముసమ్మే మొదలుబలాటము

ఎప్పుడు వచ్చును ఎక్కడికొచ్చును

అన్నది పెంచును మన ఆరాటము

       గమనాగమనపు సూచికలున్నా

       సేద తీర్చుటకు వీచికలున్నా

       సహన మన్నదే కనబడదన్నా

       ఎండమావి యది ఎటుల గాంచినా

 వచ్చునంతలో తిండి తినెదము

అంతలోపలే నిదురపోయెదము

పిల్లల పాపల నరచికరిచెదము

మనుషులన్నదే మరచిపోయెదము

        జీవ యానమున డబ్బు చెల్లదు

        మిత్ర బాంధవుల తోడు నొల్లదు

        త్రికరణ శుద్ధిని బుద్ధిగ పెంచిన

        చిత్తము ఈశుని వీడి వెళ్ళదు

 పునరపి జననం పునరపి మరణం

చావు పుట్టుకలు వలయ తోరణం

మన చేతలు మన జన్మ కారణం

నీతి మాలితే బ్రతుకు దారుణం

          అనుబంధాలు ఆత్మీయతలు

          అన్నవేవి మనమొచ్చేటప్పుడు

          మనవనుకొన్నవి మనతోనున్నవి

          మన తోడేవీ! పోయేటప్పుడు

 పోవు రైలు మన కమితోల్లాసము

తిరుగు యానమున ఉదాసీనము

జీవికి ఏడుపు, వచ్చునప్పుడు

ఏడిపించు తా పోవునప్పుడు

        వచ్చుటకేడ్చిన జీవి తాను మరి

        మోహము కోపము లోభము వంచన

        ఐశ్వర్యమ్మును అక్కున చేర్చును

        అహంకారమును ఔదల దాల్చును

పోవునప్పుడో పూచికపుల్లయు

కోరుకున్ననూ కొనిపోలేమను

నిజమును మరచి నీల్గుచుందుము

బట్ట లేకయే వచ్చిపోయదము

        తృటిలో మనసులు కలుపుకొందుము

       తృటిలో మమతలు పెంచుకొందుము

       ఎవరిది వారిదె గమనము గమ్యము

       అంతలోపలే ఈ అనుబంధము

 అంతము లేనిది అంతు తెలియనిది

ఆలోచింపగ ఆత్మ ప్రయాణము

అవసరాలకు ఆనందాలకు

ఆలవాలమది రైలు ప్రయాణము

         ఒక్కసారి యోచించ దలచితే

         ఒక్క మాటలో చెప్పదలచితే

         పోయి వచ్చుటే రైలు ప్రయాణము

         వచ్చిపోవుటే జీవన యానము

పై గేయములోని వేదాంతమును ఆసాంతమూ గుర్తుంచుకొని ఈ సమాధానమును చదివి నీ ఆలోచనలను చక్కదిద్దుకో! ఇక ఈ విషయమును గమనించు. ఒక చిన్న పిల్లవాడు గాలి బుడగ కొన్నాడు. ఎంతో సేపు ఆడుకొనుచుండినాడు. ఆ బాలుని ఊహకు అందకుండానే అది పగిలిపోయింది. కాసేపు ఏడ్చినాడు. కొంత సమయము  గడిచిన వెంటనే తన దృష్టి వేరే ఆట వస్తువు మీద పడింది. మొదటిది మరచిపోయినాడు. తరువాత రోజు ఆ స్మృతి లేనే లేదు. ఆ బాలుడు నీవని ఊహించుకో. ఆ లేత వయసులో లేని మమకారము పెద్దయిన తరువాత ఎందుకు వచ్చినట్లు? వయసు తో బాటూ నీవు మమకారము పెంచుకొంటూ పోయినావు. ఇప్పుడు ఆ వ్యక్తి లేక వస్తువు పోతే బాధ తో కృంగిపోతున్నావు. రేపు నీవే వయోభారముచే కృంగి పోతావు ఆపై నీవే వుండవు. ఏమయి పోతూంది నీ మమకారము.

ఇంకొక వాస్తవాన్ని గమనించు. మనిషికి 1. బాల్యము 2. కౌమారము 3. యౌవ్వనము 4. వార్ధక్యము అన్న నాలుగు దశలు వున్నవి అన్న విషయము మనకందరకూ తెలిసినదే. ఇప్పుడు మొదటి దశ యగు బాల్యమును తీసుకొందాము. నీవు పుట్టినపుడు మీ ప్రక్క ఇంటిలో పిల్లలు లేని దంపతులు వున్దేవారనుకొందాము. నీవు ఎంతో ముద్దుగా ఉన్నందువల్ల వారు నిన్ను ఎత్తుకొని ఎంతో ముద్దుచేసేవారు. ఉద్యోగరీత్యా వారికి బదిలీ యగుట మూలమున వారు వూరు వదలి వెళ్ళిపోయినారు. ఒక 25 సంవత్సరముల పిదప నీవున్న వూరికిమీయింటికి వచ్చి మీ తండ్రి పేరు చెప్పి ఉనారా అని అడిగినారు. ఉన్నారు ఇప్పుడే బయటికి వెళ్ళినారు అని చెప్పినావు. వస్తారు రండి కూర్చొండి అన్నావు. ఇంతయినా వారెవ్వరూ అన్నది నీవుగానీ నీవేవ్వరు అన్నది వారు గానీ గుర్తించలేదు. కారణము ఏమిటి. నీ బాల్యము అన్న మొదటి దశ విడుచుటతో నీ పరిసరములు మారిపొయినాయి. కొత్త పరిసరాలుకొత్త మనుషులుకొత్త సంబంధాలు. యౌవ్వనముతోకౌమారము యొక్క నైసర్గికము కూడా నీ నుండి నిష్క్రమించింది. అంటే దీనివల్ల మనకు ఏమి అవగాతమౌతూ వుంది. మనము ఒక్కక్క దశ వదలుచున్నప్పుడల్లా ఆ దశకు సంబంధించిన అనేక విషయములనుమనుషులనుపరిసరములను కూడా మరచి పోతున్నాము. శరీరము విడువలేదు కాబట్టి దానిని అంటుకొనియున్న బుద్ధి కొన్నింటిని గుర్తు పెట్టుకొనియుంది. కాయము మాయమైతే బుద్ధి కూడా భూతాలలో కలిసిపోతుంది. మల్లి గుర్తు వుంచుకొనే అవకాశము లేదు. ఆత్మా అమరము కావున అది వేరు ఉపాధిని పొందుతూ వుంది. అంటేనీ ఆత్మ పరమాత్మను చేరి తిరిగి వేరొక దేహమునాశ్రయించుచుచున్నది.ఇదే విషయాన్నే శ్రీ కృష్ణుడు ఈవిధంగా చెబుతున్నాడు.


దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనంజరా

తథా దేహాంతరః ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి    13-2

 

వపుషము మారిన వరుసగ బాల్య,కు

మారమెవ్వనము మరి వార్ధక్యము 

ఆత్మకు తోడుగ అనుసరించునవి

వేరొక కాయము వేరొక ప్రాంతము

ఇందుకోసమై ఎందుకు మోహము 

వీడుము దానిని విధిగా ధీరుడ    (స్వేచ్ఛానువాదము ) 13-2

ఆకారము చూసి భ్రమయ వద్దు. ఆత్మ ను గూర్చి తెలుసుకో! నీవిపుడు కలిగియున్న దేహానికి బాల్య యౌవన కౌమార వార్ధక్యాలెట్లు కలుగుచున్నాయోఈ దేహమును వీడి వేరొక దేహము నాశ్రయించి నపుడు దానికీ ఈవే అవస్థలుంటాయి. రూపము మారుతుంది. గతములో నీ స్థూల సూక్ష్మకారణ శరీరములతో చేసిన కర్మలు నీ అత్త్మకు అంటవు కావున వేరొక వపుషమునకు మారినపుడు నీకు తలంపుకు వచ్చుట లేదు. అటువంటి జ్ఞాపకాలు అసలు బుద్ధికి సంబంధించినవి. శరీరముతో బాటూ బుద్దికూడా మట్టిలో కలిసిపోతుంది.  కాబట్టి నీవు గుర్తించడముములేదు. అంతే కానీ ఆత్మికులమైన మనకు మరణము లేదు. మరి ఆ వాస్తవాన్ని నీవు గ్రహించినావంటే  మోహము దేహము పై  కలుగదు. ఈ సందర్భములో ఇంకొక మాట చెప్పుకొందాము. వాల్మీకి రామాయణం అరణ్య కాండలో ఈమమకారాల గూర్చి ఒక మాట శ్రీరామ చంద్రుడు  చెబుతాడు :

యదా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే 

సమేత్యపి వ్యపెయేతాం కాలమాసాధ్య కంచన

 

ఏవం భార్యాశ్చ పుత్రాంశ్చ జ్ఞాతయస్య ధనానిచ 

సమేత్య వ్యవధావంతి  ధృవోహ్యేషాం వినాభవః

పెద్ద ప్రవాహములో కొట్టుకుపోయే రెండు దుంగలు ఒకటై కలిసి కొంతదూరము పోయిన తరువాత తిరిగీ దేనికది విడిపోయి తమ ప్రయాణమును ఆ ప్రవాహములో కొనసాగించుతాయి. దారాపుత్ర ధన జన సముదాయము కూడా అంతే.

ఇన్ని విధాల పెద్దలు చెప్పినా కూడా ఇంకా ఈ మమకార వికారములు అవసరమా!

 స్వస్తి


5 మరోమారు..........

సమస్య మనది -- సలహా గీతది -- 5 

సమస్య  : చనిపోయిన శరీరము బూడిదయిపోవడమో,  మట్టిలో కలవడమో జరుగుతూవున్నది కదా, మరి ఎటూ చచ్చే దానికి మంచే ఎందుకు చేయాలినేను పనిచేసే సంస్థలో, బాధ్యతనెరిగి ప్రవర్తించని వారు ఎందఱోవున్నారు. కష్టపడి పనిచేసే వారూ వున్నారు. మరి ఇరువురిలో పరమాత్మ ఆత్మ రూపములో వున్నపుడు ఈ తేడాలెందుకు.


సలహా : ఇవి రెండు విషయములుగా వర్గీకరించి ఒక్కొక్కటిగా విశ్లేషించు కొందాము. ముందు అసలు ఎటుతిరిగీ చచ్చేదానికి మంచి చేయవలసిన అవసరమేమిటి అన్న విషయమును గూర్చి పరిశీలించుదాము.

 

శరీరము పంచభూతాత్మకము. పంచ భూతాలు 1.పృథివి (భూమి) 2. ఆపస్సు (నీరు ) ౩. తేజస్సు ( వెలుగు )

4. వాయువు (గాలి) 5ఆకాశము (ఆకాశం గగనం శూన్యం .  అందనిదిఅగుపించనిది. అగుపించుతూ వుంది అని మనమనుకోనేది భ్రమ.) పంచభూతముల యొక్క కలయికే ప్రాణము. ఈ పంచభూతములలోని అణువుల కలయిక చేత  ఒక ప్రాణము ఏర్పడుతుంది. మరి ప్రాణులలో ఒకరికొకరికి పోలిక ఉండదు కదా అంటే అది ఈ అణుసంయోగములోని అనంతవిధముల నిష్పత్తుల పౌనఃపున్య ప్రభావము వల్ల. ఈ వాస్తవాన్ని గమనించు. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు పోయాగా అది మూడు నాలుగు రోజులలో   మొలకెత్తి భూమిపై కనిపిస్తుంది. నిజానికి అది పెరగుటకు భూమినీరుగాలిఆకాశము (ఎండ అనగా సూర్య రశ్మిచంద్రకాంతి* నుండి వచ్చే ఉష్ణము) అన్నియు కావలసిందే!  దీనివలన ఒక ప్రాణి ఉత్పన్నమగుటకు పంచభూత శక్తి ఎట్లు సహాయపడుతున్నదో మనకు తెలియుచున్నది. ఈ పంచభూత శక్తి పలు ప్రాణులుగానూ, మానవునిగానూ  రూపములు ధరించుచున్నది. అప్పుడు పంచభూతముల స్థితి ఏమనగా -- గాలి మనసుగానునీరు ప్రాణశక్తిగానునిప్పు శరీరమును నిర్వర్తించు శక్తిగానుభూమి దేహముగానుఆకాశము ఆత్మ ఉండు చోటుగాను ఉండును. ఇదే మానవుని రూపము. ఇవి అన్ని చేరి ఒక మానవుని ప్రాణముగా ఏర్పడుతున్నవి.

 

(* చంద్రకాంతి మొక్కల పెరుగుదలకు ముఖ్యము అన్న విషయమును తెలుసుకోనుటకై అతి క్లుప్తముగా తెలియజేయుచున్నాను. దీనికి ‘సమస్య మనది  సలహా గీతది’ తో సంబంధము లేదు. 

చంద్రుని కాంతిఅమృత గుణములు కలదిఅదిఓషధులుకూరగాయలుపండ్లుధాన్యములు వంటి సమస్త వృక్ష జీవరాశికి పుష్టిని కలిగించి పోషిస్తుంది. ఋగ్వేద సంహితలోని  97 వ సూక్తము లోని 19 వ మంత్రము ఈ విధముగా చెబుతుంది: ఏ ఓషధులకు రాజు చంద్రుడు అగుచున్నాడో ఏవి భూమండలమున అనేక చోట్ల లభించునో వేనిని బృహస్పతి ఉత్పత్తి చేసినాడో అవి రోగికి శక్తిని ప్రసాదించునుగాత.

ఈ యొక్క పోషక గుణములను చంద్రకాంతి అనగా వెన్నెల కు అందించేది తానే అని శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీతలో పేర్కొంటున్నాడు.

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।

పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ।।   13 - 15

 

వసుధయందు నే వ్యాప్తి నొందుచూ

సమస్త ప్రాణుల సంరక్షించెద

చంద్రుడనై నే సర్వౌషధులకు

పుష్టిని పూరా పురమాయించెద                               13 - 15

పృథ్వి అంతటా వ్యాపించినేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రునిగా ఉండిసమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.

 

 చంద్రుడి పెరుగుదల మరియు పతనము మొక్కల ఎదుగుదలను ప్రభావితము చేస్తుంది. మొక్కలు నేల మరియు నీటిమట్టముతేమపై గురుత్వాకర్షణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.  కృష్ణ పక్షములోని చంద్రుని వెలుతురు మొక్కల వేర్లకు ఎక్కడలేని బలమును చేకూర్చుతాయి. విత్తనములు మొలకెత్తుటకు మంచి సమయము. మొక్కల పోషణకుఫలిన్చుటకు శుక్లపక్షము మంచి అదను. ఇది నేటి Science చెబుతూ వుండే మాట. నా మాట కాదు.

మరి ఇంతటి గొప్పవిషయములను తెలిపిన వేదములను, వాటిని తరతరాలుగా కాపాడుకొంటూ వస్తూవున్న బ్రాహ్మణులను మనము ఎంత చిన్న చూపు చూస్తూ వున్నామో ఒక్క సారి సింహావలోకనము చేస్తే అవగతమౌతుంది ఆయా విషయములయోక్క ప్రాశస్త్యము. వేదచోదితవిషములను అర్జునుని ఆలంబనగా తీసుకొని యుద్ధమునకు సుముఖునిజేయు నెపముతో ఎన్ని చెబుతున్నాడో చూడండి ఆ పరమాత్ముడు.)

తిరిగీ అసలు విషయమునకు వస్తే, ఆత్మ ను అంటి పెట్టుకొని ఉంది ఈ నశ్వరమైన శరీరము. ఆత్మ పరమాత్మ చేరితే మరి పంచ భౌతికము పంచ భూతాలను చేర వలసినదే కదా ! ఆ విషయమును చక్కగా గ్రహించమని శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు:

 

అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః

అనాశినో  ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత  18--2     


పార్థా వపుషము  పార్థివ మేనని

అవ్యయమైనది ఆత్మయేనని 

అవినాశమ్మని అప్రమేయమని

ఎరుగుమువైరుల నెదిరి పోరుము     (స్వేచ్ఛానువాదము ) 18--2     

 

అర్జునా! అంతా నీ భ్రమ గానీ దేహములే వేరు దేహి ఒకటే . అదే ఆత్మ. అది అవ్యయముఅవినాశము. ఆత్మ వీడితే, మిగిలేది పంచభూతాలలో చేరిపోయే శరీరమే ! నీ యుద్ధము దుష్కర్మల కూడిన శరీరమును దునుముటకు మాత్రమే. సందేహము మాని నీవు చేయు కర్మ కొరకై సన్నద్ధుడవుకమ్ము. అరటి పండు వలిచి నోట్లో కూడా కాదు కడుపులో పెట్టినంత సులభముగా చెప్పినాడు మహా జ్ఞాని యైన శ్రీకృష్ణుడు.

ఇక్కడ ఆత్మ విద్యుత్  Electricity అనుకుందాము. మన ఇంటిలోని అన్ని విద్యుత్ ఉపకరణములలో అది ఉన్నది . ప్రతి ఉపకరణము ఒక దేహము. అందులోకి విద్యుత్తు చేరనంతవరకు అది మృతమే . ఏ మీట నొక్కితే ఆ నాళిక (tube or CFL bulb ) వెలుగుతుంది లేక ఏ విద్యుదుపకరణము యొక్క మీట నొక్కితే అది పనిజేయుట మొదలుపెడుతుంది . ఒకవేళ విద్యుత్తు ప్రవహించే రెండు తీవెలను ( మరియు - ) తాకినామంటే  విద్యుద్ఘాతము కలుగుతుంది. వెంటనే దానినుండి ఆత్మను వేరుచేస్తాము, అంటే మీట తిరిగీ నొక్కి విద్యుత్ ప్రవాహము ఆపుజేస్తాము. అప్పుడు అది నిర్జీవమౌతుంది. అంటే విద్యుత్ ప్రవాహము నిలచిపోతుంది. ఇక్కడ విద్యుత్ నాళిక మంచివ్యక్తివదిలిన తంతులు చెడ్డ వాడు. రెంటిలో కూడా విద్యుత్తే కదా వుండినది. కాబట్టి సృష్టి అంతా ఒకే విధముగా ఉండుటకు వీలుండదు. విద్యుత్తు ఒకటే గానీ ఉపకరణములు వేరువేరు. దేని పని దానిది. కావున ఒకే విద్యుత్తే వినాశనమునకు దోహదపడుతుంది, వికాసమునకు దోహదపడుతుంది.  కాబట్టి ఉపకరణములు అంటే కర్మల చేత, కర్మలకొరకు ఏర్పడే శరీరములను బట్టే విద్యుత్తు పని చేస్తుంది. తనలో ఏ విధమగు మార్పూ ఉండదు. అదే ఆత్మ తత్వము సులభముగా చెప్పవలసి వస్తే!

 

ఇక్కడ గమనించవలసినది ఇంకొకటి ఉంది. నీవు ఇంటిలో అంటే ఇప్పుడు కార్యాలయములో ప్రముఖునివి. నీకు వలసినది వెలుతురు అంటే నీవు తలచిన పనిని జరిపించుట. దీనికి నీవు నీ ఆధీనోద్యోగులను ఆపనిని పూర్తిచేయుటకు భాగస్వాములను చేస్తావు. ఇందులో పనిపై శ్రద్ధ కలిగినవాళ్ళు శ్రద్ధ లేనివాళ్ళు, పని చెడగోట్టేవాళ్ళు కూడా వుంటారు. ఎవరివద్దనుండి ఏమేమి , ఎంతెంత గ్రహించవలెనో అది నీ బాధ్యత అవుతుంది. వారంతా విడివిడిగా పనులుచేస్తూవున్నా వారి మెదడులో నిండియున్నది నీ ఆదేశమే! నీ ఆదేశమే లేకుంటే వారికి పనే లేదుకదా! నీ కార్యమునకు కాల పరిమితి వుంటుంది. నీకూ కాల పరిమితి వుంటుంది కానీ నీసంస్థకు అదిలేదు. నీవు పదవీ విరమణ చేసినా నీబదులు ఎవరో వస్తారు. పని జరుగుతూనే వుంటుంది. ఇదే మాటను రాజ్ కపూర్ యొక్క ‘మేరా నాం జోకర్’ సినిమాలో, జోకర్ ఒక పాటలో ఈ మాటలు చెబుతాడు. ‘కల్ ఖేల్ మేఁ హం హో నాహో గర్దిశ్ మే తారే రహేంగే సదా’ అంటే రేపు నేనున్నా లేకున్నా ఈ ఆక్కసములో తారలు అట్లే నిలిచి వుంటాయి. అంటే ఈ సృష్టి కార్యము, అంటే పాత పోవడము, క్రొత్త రావడమూ జరుగుతూనే వుంటుంది. నీ మంచే, నీశ్రద్ధే, నీ తదనంతరము కూడా నీపేరు నిలుపుతుంది. శరీరము వదిలిన పిదప కూడా నీకు సత్కర్మ ఫలితము లభించుతుంది. వేదాంత పరముగా ఆత్మా ఒక మంచి దేహమును చూచుకొంటుంది, అదే లౌకిక దృష్టిలో అయితే నీ మంచితనమే నీవు పదవి విరమించిన పిదప కూడా వేరే కంపెనీలో మంచి ఉద్యోగమూ చూపెడుతుంది. ఎవిత్త నము వేస్తె ఆచెట్టే మొలుస్తుంది.

ఇక కర్మల గూర్చి:

శ్రమ లేకుండా ఆత్మానాత్మ వివేకమను ప్రకరణ గ్రంథములో ఆది శంకరులు ఈ విధముగా వివరించినారు:

ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది?

పూర్వ జన్మ లలోని కర్మ వలన.

కర్మ ఎందుకు జరుగుతుంది?

రాగం (కోరిక) వలన.

రాగాదులు ఎందుకు కలుగుతాయి?

అభిమానం (నాది, కావాలి అనే భావం) వలన.

అభిమానం ఎందుకు కలుగుతుంది?

అవివేకం వలన

అవివేకం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానం వలన

అజ్ఞానం ఎందుకు కలుగుతుంది?

అజ్ఞానానికి కారణం లేదు. అది అనాదిగా ఉన్నది. (వెలుగు లేని చోట చీకటి ఉన్నట్లుగా. అందుకు కారణం ఉండదు.) దాని పుట్టుక ఎవరూ ఎరుగరు. అది మాయ. త్రిగుణాత్మకం. జ్ఞానానికి విరోధి. అదే అజ్ఞానఅనగా అజ్ఞానం వలన అవివేకం, అవివేకం వలన అభిమానం, అభిమానం వలన రాగాదులు, రాగాదుల వలన కర్మలు, కర్మల వలన పునర్జన్మ (శరీర ధారణ), అందువలన దుఃఖం కలుగుతున్నాయి. 

ఇక వారి మాటను మీరి వేరేమి చెప్పవలసినది ఉంటుంది.

స్వస్తి. (మరొకసారి మరోసమస్యతో మళ్ళీ 6లో కలుద్దాము.)


Comments

Popular posts from this blog

సమస్య మనది -- సలహా గీతది -- 14

సమస్య మనది -- సలహా గీతది -- 11

సమస్య మనది -- సలహా గీతది -- 10