సమస్య మనది -- సలహా గీతది -- 14

 

సమస్య మనది -- సలహా గీతది -- 14

 https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/12/14.html

నేను కొత్తగా ఒక పరిశ్రమను ఏర్పాటుచేయ దలచుకొన్నాను. ఎన్నో ఆలోచనలు ఎన్నో భయాలు. అసలు మొదలు పెడదామా వద్దా అన్న సందేహాలు. ఎటూ తోచని స్థితి. ఏమి చేయవలెనన్నది నా ఆందోళన.

 

సలహా : ‘శ్రేయాంసి బహువిఘ్నాని’ అన్నమాట సామాన్యముగా నీవు వినే ఉంటావు. ఆ వాక్యమును కలిగిన శ్లోకము యొక్క పూర్తి పాఠము ఇది.

శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహాతామపి

అశ్రేయసి ప్రవృత్తానాం దూరం యాన్తి వినాయకాః

మంచి వారు మంచి పనినే తలపెడుతారు. తలపెట్టిన పని మంచిదయితే దానికి ఆటంకాలు కోకొల్లలు. అదే దుష్టులు తలపెట్టే దుష్కార్యములు నిరాటంకముగా జరిగి పోతాయి. దుష్కార్యము తలపెట్టేవాడు దుష్టుడు కాక మరేమౌతాడు. నాటి కాలములో పల్లెటూరి వాతావరణము కలిగిన చలన చిత్రాలలో ANR లాంటి హీరోలు జనాన్ని కలుపుకొని తమ పొలాలకు నీరు వచ్చేలాగు కష్టపడి ఏర్పాటు చేసుకొంటే ఏ రౌడి రాజనాలో వచ్చి ఆ జలాశయానికి   గండి కొడతాడు. కథ ఇక్కడ ఆపేద్దాము. ఒక మంచి పని చేయుటకు ఎంతోమంది చేయూతతోకూడిన  ఎంతో కష్టము ఒక్కటయితే తప్ప నీటిని పొలాలకు తరలించే పని జరుగలేదు. అదే ఆ జలాశాయానికి గండి రాజనాల ఒకడే కొట్టినట్లు చూపుతారు. అంటే పని మంచిదయితే పాట్లు ఎక్కువగా వుంటాయి. చెడ్డదయితే ఒక్క క్షణము. అంతే.

అందుకే పెద్దలు ‘కుమ్మరికొక ఏడు గుదెకొకనాడు’ అంటారు.

బంకమట్టి తెచ్చి, తడిపి, గుదె   (అంటే అంచులు కూచిగాలేని కొయ్య తో చేయబడిన ఒక దీర్ఘ చతురస్ర సాధనము. కుమ్మరి దానిని పట్టుకొనుటకు వీలుగా పిడి వుంటుంది.), సారె అంటే తాను చేసే మట్టి వస్తువులను అందముగా తీర్చుటకు కుమ్మరి ఉపయోగించే చక్రము, అయిన తరువాత ఆవము (అంటే ఒక అగ్నిగుండము. వెలిగించుటకు ముందే కాల్చవలసిన మట్టిపాత్రాలను ఆ గుండములో పేరుస్తారు. తరువాతి రోజు అవి కాలి గుండములోని కట్టెలు బూడిద అయి చల్లారిన తరువాత వానిని ఒకగోడకు చేరువగా వరుసగా చాలా ఎత్తుగా పేరుస్తారు.)లో  పెట్టి కాల్చి సంవత్సరము పొడవునా దొంతరగా చాలా ఎత్తుగా పెర్చుకొంటూ వస్తారు. ఇది ఒక సంవత్సర ఫలము. కానీ ఏ బుద్ధిలేనివడో, దుర్మార్గుడో గుదె తో కిన్దివరుసను కొడితే చాలు, సంవత్సరము పొడవున పడిన శ్రమ అంతా బూడిద పాలే!

కావున మనము తలపెట్టిన మానవ ప్రయత్నముగా ఈ విధమగు అవాంతరములు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కావలసిన స్థలము చట్టబద్ధమైన పట్టా, తగిన కట్టడము, నీటి మరియు విద్యుత్ వసతి, వీటి కావలసిన పెట్టుబడి, పెట్టుబడికి ఋణసహాయము చేసే BANK చూసుకోవాలి . తగిన ముడి సరుకు నీవు పరిశ్రమ తలపెట్టిన ప్రాంతములో సులభముగా దొరుకుతూ ఉందా లేదా చూసుకోవాలి. మానవ వనరులు (Labour and other human resources) చక్కగా అందుబాటులో ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఏదీ విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నిర్దుష్టముగా ఒక పతాకము ప్రకారము నీవు పనిని ప్రారంభించవలసి వుంటుంది. ఏతావాతా నేను చెప్పవచ్చింది ఏమిటంటే నీవు అన్నివిధాలా సిద్ధమయినావంటే ఆలోచించవలసినది ఏమీ ఉండదు. భయపడవలసినదీ ఏమీ ఉండదు. నీలో చిత్తశుద్ధివుంటే చాలు. నిర్భయముగా నీపని చేయి. ఫలితము భగవంతునిపై వదులు. నీవు ఏపని చేయుటకైనా ముందే కష్ట సుఖాలు లాభనష్టాలు జయాపజయాలు బేరీజు వేసుకో ! ఆలోచించుటకు కాలము వెచ్చించు కానీ ఆచరణకు మాత్రం  ఆలస్యము చేయవద్దు. ఫలితము నీ చేతిలో లేదు గానీ పట్టుదల నీవద్ద వుంది. దీక్షతో చేసే ఎపనినైనా దేవుడు మెచ్చుతాడు. ఫలితమునకు కర్త ఆయనే . నీవాశించిన ఫలితము వచ్చినంతమాత్రాన నీకు మేలు ఒనగూరక పోవచ్చు. ఫలితము నీ ఊహకు అనుకూలముగా రానందువల్ల మేలు సమకూరనూ వచ్చు. అత్యంత అవసరమైన పనికి నీవు ఒక flight పట్టుకోవాలనుకోన్నావు. అడ్డంకులు అనుమతించక నీవు పోలేక పోయినావు. ఆ flight crash అయింది. మరి అది నీవనుకొన్నట్లు జరుగకున్నా  నీకు జరిగినది మేలే కదా ! నీకు చెందే ప్రతి గింజ మీదా నీ పేరుంటుంది . అందుకే చింతకు వంత పాడకు. అందుకే వాసుదేవుడు భగవద్గీతలో అర్జునునికి ఈ విధముగా సలహా ఇస్తాడు:

సుఖదుఃఖేసమే కృత్వాలాభాలాభౌ జయాజయౌ

తతో యుద్ధాయ యుజ్యస్వ పాపమవాప్స్య సి      38-2

 

సుఖదుఃఖములను చూడుము సమముగ

లాభాలాభమలగ్నము జేయుము

జయాజయాలకు చలించబోకుము

యుద్ధముకొరకై సిద్ధము కమ్ము                        38-2

ఇదే భావాన్నే ఈవిధముగా కూడా తెలుగులో తెలిపినాను.

సుఖదుఃఖములను చూడుము సమముగ

లాభనష్టముల లంపట మానుము

జయాపజయముల చపలత విడువుము

యుద్ధ మొక్కటే యుక్తమనెరుగుము

సుఖ దుఃఖాలు , లాభనష్టాలు, జయాపజయాలు అన్న ద్వంద్వముల జోలికి పోక నీ ధర్మమూ నీవు నెరవేర్చు. ధర్మయుద్ధము క్షత్రియ విధి. దానినుండి దూరము పోకు. యుద్ధము పాపమనుకొనే అర్జనుణ్ణి యుద్ధము చేయుటే ధర్మమని నొప్పించకనే ఒప్పించుతాడు. అది ఆయన సామర్థ్యము. ఈ దిగువ తెలియబరచినది ఆయన మాటలోని సారాంశమే!

కార్యశూరుడెప్పుడునూ కాజాలడు భీరుడు

ముళ్ళతోటలో కూడా పళ్ళకొరకు వెదకుతాడు.

కష్టాలకు కడగళ్ళకు కలనైనా తావివ్వడు

ఫలితమెప్పుడూ  కోరక  పైవానికి వదులుతాడు.

 

నీవు పరిశ్రమ స్థాపించడము, యుద్ధము చేయడము వేరువేరు అనుకొంటున్నావేమో! ఏమాత్రమూ కాదు. అదయినా పూర్తిగా ప్రణాలికా బద్ధమే ఇదయినా అంతే! బాణము, విల్లు, లక్ష్యము, దీక్ష, నీ నైపుణ్యము అన్నీ వున్నపుడు ఆలోచించనవసరము లేదు. షాణ్మాసిక సమీక్ష(Half yearly review) వంటివి ఏర్పాటుచేసుకొంటే పరిశ్రమ తీరు తెన్నూ తెలిసివస్తాయి. అదే యుద్ధములోనైతే ప్రతిరోజూ యుద్ధము ముగిసిన పిదప సమీక్షించుకొని తరువాతి రోజుకు వలసిన ప్రణాళిక సిద్ధము చేసుకొనవలసి వస్తుంది.

పట్టుదలకు పట్టం గట్టు

పనిపైనే చూపును పెట్టు

పనివారలతో జత కట్టు

భవితకదే ఆయువు పట్టు

స్వస్తి.

Comments

Popular posts from this blog

సమస్య మనది -- సలహా గీతది -- 11

సమస్య మనది -- సలహా గీతది -- 10