సమస్య మనది -- సలహా గీతది -- 6

 

సమస్య మనది -- సలహా గీతది -- 6

 https://samsyamanadi-salahagitadi.blogspot.com/2025/08/6.html

సమస్య :ఈ ఋతువులన్నీ నాకు బాధా కారకాలే. ఎండ వుంటే చల్లగాలి ఉంటె బాగుంటుందనిపిస్తుంది. వాన వుంటే ఎండా కావాలనిపిస్తుంది, గాలి ఎక్కువైతే వానతో ధూళి అనగి పోవాలనిపిస్తుంది . ఏదీ భరించలేను.

 

సలహా : అసలు ఒకటి ఉంటె ఇంకొకటి కావాలనే మనస్తత్వము నీదని తెలుసు కాబట్టే ఏ ఋతువు శాశ్వతము కాకుండా ఏర్పాటు చేయ బడినాయి. అయినా నీ స్వార్థము ఎల్లపుడూ ఒకటి వుంటే వేరొకటి కావాలన్న తలంపుయ్ నీలో రేకెత్తిస్తుంది. నీకు విసుగు కలిగినపుడు కాస్త ఓపిక పడితే వేరే ఋతువు వస్తుంది కదా. మహర్షి వాల్మీకి 'క్షమయా నిష్ఠితాం జగత్ ' అని అన్నారు. క్షమా అంటే ఓర్పు, సహనము. ఓర్పు కలిగితే మంచి వైపుకు మార్పు కలుగుతుంది. లెకుంటే ఓదార్పు మిగులుతుంది. ఈ విషయముగా గీత ఏమంటూవుందో చూతమా !

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః

ఆగమాపాయినో 'నిత్యాస్తాం తితిక్షస్వ భారత 14--2

 

చితికే వరకు శీతోష్ణమ్ములు

సుఖదుఃఖమ్ములు చుట్టపు చూపులు

వచ్చిపోవుననివార్యము లయ్యవి

తితీక్ష కల్గుట తెలియుము భారత 14 -- 2

 

భారతుని వంశజుడైనందువల్ల భారతుడైనాడనే కాకుండా అభివ్రుద్ధియందు కోరిక గలవాడు అని కూడా అన్వయించుకొనవచ్చును. తితీక్ష అంటే సహనము, ఓర్పు, క్షమ. ఆదికవి వాల్మీకి కాకుండా అపర హరి యైన వ్యాసుడు కూడా ' క్షమయా నిష్ఠితాం జగత్' అనే నుడివినారు. జీవితమే ద్వన్ద్వాత్మకము. చివరి వరకు చేరదీయవలసినదే. శిశిరము వచ్చింది అంటే వసంతము వెంబడే వస్తున్నట్లే!

 

**********************************************************

 

సమస్య మనది -- సలహా గీతది -- 7

 

 

సమస్య : ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలకు గురికానివారేవరైనా ఉంటారా? వారికి మోక్షమబ్బుతుందంటారా ?

 

సలహా : గురికానివారుంటారు. వారు ఆవిధముగా ఉండుటకొరకు అకుంఠిత మైన సాధన చేసినవారు. నీవు ఆ దీక్ష వహించితే నీకూ మోక్షపదము తప్పదు.  నిజము చెప్పవలసి వస్తే ఇవి లేనివారెవ్వరు. తేడా అంతా అవి సహించడములోనే. లోహములు అనేవంతా ఒక వర్గముగా తీసుకొంటే ఒక్కొక్క లోహము ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ద్రవీభవించుతుంది . అంటే సహన శక్తి మారుతూ వుంటుంది ఒక్కొక్క లోహానికి. అవి నిర్జీవాలు . వాని గుణములు మారవు . మనము జీవులము మనలో వయసు పెరిగే కొద్దీ శారీరిక మానసిక మార్పులు కుప్పలు తెప్పలు. మన పురోగమనము పరమాత్ముని వైపే అయితే మన సహన సౌశీల్యములను పెంచుకొంటేనే కదా, పోగలిగేది. కాబట్టి 

కార్య ఫలితములకు పొంగక క్రుంగక ఉండటమే ధీర లక్షణము . అదే అమృతత్వపు దారిని జేర్చేది క్షణక్షణము.

భగవానుడైన శ్రీ కృష్ణుడు ఈ విషయమై ఏమంటున్నాడో గమనించండి :

 

యంహినః వ్యతయన్త్యేతే పురుషం పురుషర్షభ


సమదుఃఖ సుఖం ధీరం సో'మృతత్వాయ కల్పతే   15 - 2



సుఖ దుఃఖమ్ములు సోదర జాతలు

స్థిరములు కావవి స్థిమితము పొందుము


సమ దృక్పథమే  సాధన సుపధము

-2 దివ్యత్వమ్మును  ధీరుడు పొందగ     15 - 2


కృష్ణుడు ఎక్కడా ద్వంద్వా తీతము, అంటే సుఖ దుఃఖాలు, లాభనష్టాలు, శీతోష్ణాలు , మమకారవికారాలు, బంధ విబంధాలు మొదలయిన దేనికీ అతీతముగా వుండమనుట లేదు. వానిని అనుభవించుతూనే నీటిపై తేలే నేతిచుక్క లా ఉండమని ఉపదేశము. నేతిచుక్కే ఎందుకు అంటే కరిగిన నేతిబొట్టు నీటిలో పడుతూనే నీటితో 


కలిసినట్లుంటుంది. కాసేపటి తరువాత గనీభవించి  అంటియుంటూ కూడా అంటనట్లే వుంటుంది. మనము కూడా 


నేర్చుకోవలసినది అదే. 'కృషితో నాస్తి దుర్భక్షం' 'సాధనమున పనులు సమకూరు ధర లోన' అన్నారు పెద్దలు . 


శుభస్య శీఘ్రం.

 

Comments

Popular posts from this blog

సమస్య మనది -- సలహా గీతది -- 14

సమస్య మనది -- సలహా గీతది -- 11

సమస్య మనది -- సలహా గీతది -- 10